డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడి కోసం వెళ్లి శవమై కనిపించిన యువతి!

ఓ డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువకుడిని కలుసుకునేందుకు వెళ్లిన ఓ యువతి శవమై కనిపించిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఈనెల 22న తమ కుమార్తె కిడ్నాప్ అయినట్టు తల్లిదండ్రులు ఇచ్చిన కేసును విచారించిన ఢిల్లీ పోలీసులు, మరిన్ని వివరాలను మీడియా ముందుంచారు. కేసులో 25 సంవత్సరాల ఇష్రత్ అలీ నిందితుడని, అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న 21 సంవత్సరాల యువతికి డేటింగ్ యాప్ ద్వారా ఇష్రత్ అలీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం పెరగడంతో, 22వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ద్వారకా సెక్టార్ 13 వద్ద ఇద్దరూ కలుసుకున్నారు.

ఆపై ఇద్దరూ రాత్రి వరకూ కలిసే ఉన్నారు. నాటి రాత్రి ఏదో విషయంలో గొడవ జరుగగా, ఇష్రత్ ఆగ్రహంతో సుత్తితో ఆమె తలపై కొట్టగా, ఆమె మరణించింది. ఆపై మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడేసిన ఇష్రత్, ఆమె తండ్రికి ఫోన్ చేసి, మీ కుమార్తెను కిడ్నాప్ చేశానని, రూ. 50 లక్షలు ఇస్తే వదిలి పెడతానని చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, కేసును సీరియస్ గా తీసుకుని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ లో యువతితో పాటు ఇష్రత్ కూడా కనిపించాడు. ఆపై అతనికి డబ్బులు ఇప్పిస్తామని ఆమె తండ్రితో చెప్పించిన పోలీసులు, అతనిని రప్పించి, గురువారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని న్యూఢిల్లీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌ చౌదరి తెలిపారు.
Go Back to Shorts
New Delhi
Kidnap
Dating App
Murder

More Telugu News